: దేశంలో ఎవరికీ రానన్ని అవార్డులు మనకి వచ్చాయి: సీఎం చంద్రబాబు
దేశంలో ఎవరికీ రానన్ని అవార్డులు మనకి వచ్చాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు అమరావతిలో ఆయన అధికారులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మరింత ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. తాజాగా ప్రారంభించిన సీఎం కనెక్ట్ యాప్ ద్వారా ప్రజల స్పందన తెలుసుకుంటున్నామని అన్నారు. జియో ట్యాగింగ్ ద్వారా తమకు వచ్చిన ప్రశ్నలు ఏ ప్రాంతంనుంచి వచ్చాయో తెలుసుకుంటామని చెప్పారు.
ప్రభుత్వంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని చంద్రబాబు అన్నారు. కులం, మతం, ప్రాంతంపై ఆధారపడి నిర్ణయాలు తీసుకోకూడదని ఆయన అధికారులకు సూచనలు చేశారు. రాష్ట్రంలోని అన్ని విభాగాలు పోటీపడి పనిచేయాలని అన్నారు. ఈ నెల 20న ప్రజల నుంచి ఫిర్యాదులు సేకరించడానికి కాల్ సెంటర్ కూడా ప్రారంభిస్తామని చెప్పారు. సమర్థపాలన అందించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. సీఎం కనెక్ట్ యాప్‌కి ఇప్పటివరకు 1665 మంది నుంచి స్పందన వచ్చిందని అన్నారు. అనుభవపూర్వక సలహాలు, సూచనలు ఇస్తే పరిశీలిస్తామని చెప్పారు. యాప్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటున్నామన్నారు.