: ఎవరిసాయం లేకుండా 60 అడుగుల బావిని తవ్విన మహిళ!
నీళ్ల కోసం ఒకే ఒక మహిళ 60 అడుగుల బావిని తవ్వి మంచి ఫలితాన్ని అందుకుంటున్న ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. నీటి కోసం కూలీలను పెట్టించి బావి తవ్వించడానికి ఆమె వద్ద డబ్బులు లేవు.. కానీ ఆత్మవిశ్వాసం, కష్టపడేతత్వమే పెట్టుబడిగా ఆమె 51 ఏళ్ల వయసులోనూ ఆ సాహసం చేసి విజయవంతమైంది. కర్ణాటకలోని సిర్సి జిల్లాలో గణేష్ నగర్‌కు చెందిన గౌరి నాయక్ అనే మహిళ.. కొబ్బరి, అరేకా మొక్కలను పెంచుతోంది. వాటికి తగినంత నీరు అందించడానికి తమ వద్ద ఉన్న బావుల్లో నీరు సరిగా లేదు.
మొక్కలు ఎండిపోతే తనకు తినడానికి తిండి దొరకదని, తన కూతురు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందని భావించిన ఆమె... రోజుకు సుమారు 6 గంటలు కష్టపడి, మూడు నెలల్లో 60 అడుగులు తవ్వగా ఇప్పుడు ఆ బావిలో ఏడడుగుల వరకు నీళ్లు వచ్చాయి. ఇలా 60 అడుగుల బావిని ఒక్కతే తవ్వేసిన ఆమె చివర్లో మట్టిని తొలగించేందుకు ముగ్గురు మహిళల సాయం మాత్రం తీసుకుంది. ఆ మహిళ చేసిన ఈ స్ఫూర్తిదాయకమైన పని పట్ల అందరూ శభాష్ అంటున్నారు.