: 'నాటో'కు కాలం చెల్లలేదు... మాట మార్చిన ట్రంప్
నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్)కు కాలం చెల్లిపోయిందంటూ గతంలో వ్యాఖ్యానించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట మార్చారు. నాటో తన ప్రాముఖ్యాన్ని కోల్పోలేదని చెప్పారు. నాటోకు కాలం చెల్లిపోయిందని గతంలో చెప్పానని... అయితే, అద్భుతంగా పని చేస్తోందని కితాబిచ్చారు. నాటో కూడా ఉగ్రవాదంపై పోరాడుతోందని అన్నారు. నాటో, అమెరికాతో కలసి రష్యా కూడా ముందుకు సాగితే చాలా బాగుంటుందని అన్నారు.
సిరియాపై బాంబు దాడులకు పాల్పడిన నేపథ్యంలో అమెరికా, రష్యాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రానున్న కాలంలో నాటో మిత్రదేశాలతో కలసి పని చేస్తామని అన్నారు. ఉగ్రవాదం, వలసలు వంటి సమస్యలను నాటో దేశాలతో కలసి ఎదుర్కొంటామని చెప్పారు. సిరియాలో ఉగ్రవాదులను అంతమొందించి, అక్కడ నెలకొన్న అంతర్యుద్ధానికి ముగింపు పలకాలని తెలిపారు. ఈ నేపథ్యంలో, త్వరలో బ్రసెల్స్ లో జరగనున్న నాటో సదస్సుకు ట్రంప్ హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.