: ఈ నెల 19న కూలీ పనులు చేయనున్న సీఎం కేసీఆర్
ఈ నెల 14 నుంచి 20 వరకు ‘గులాబీ కూలీ దినాలు’గా ప్రకటిస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపిన విషయం తెలిసిందే. ఈ నెల 21న టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం, ఆ తర్వాత 27న వరంగల్‌లో భారీ బహిరంగ సభ జరుగనున్న నేపథ్యంలో ఆ సభకు వచ్చే వారంతా రెండు దినాలు కూలీలుగా పనిచేసి డబ్బు సంపాదించుకొని ఆ సభకు రావాలని అన్నారు. అందు కోసం సీఎం కేసీఆర్ కూడా ఈ నెల 19వతేదీన మహబూబ్‌నగర్ జిల్లా తొర్రూరులో కూలీ పనులు నిర్వహించడానికి రానున్నట్లు పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు.
కేసీఆర్ మొదట పాలకుర్తిలోని లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో పూజల్లో పాల్గొంటారని, అనంతరం బమ్మెర పోతన సమాధిని సందర్శించుకొంటారని చెప్పారు. అదే రోజు రాఘవపురంలో గ్రామసభతో పాటు పాలకుర్తిలో మిషన్ భగీరథ, దేవాదుల, ఎస్సారెస్పీ పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. బమ్మెర ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా మార్చడంతో పాటు కొత్తగా తూములు (ఓటీల) మంజూరు, పాలకుర్తి సబ్ మార్కెట్‌ను పూర్తి స్థాయి వ్యవసాయ మార్కెట్‌గా మారుస్తూ చాకలి ఐలమ్మ పేరిట మార్కెట్ ఏర్పాటు కోసం కేసీఆర్ ప్రకటన చేస్తారని ఎర్రబెల్లి అన్నారు.