: ఆ చంద్రుడిపై గ్రహాంతర వాసులున్నారా?
గ్రహాంతర వాసులున్నారా?.. వుంటే ఎలా వుంటారు? ఇలాంటి ఊహలతో హాలీవుడ్ లో పలు సినిమాలు రూపొంది సూపర్ సక్సెస్ సాధించాయి. అయితే గ్రహంతర వాసులపై చేసిన పరిశోధనలు మాత్రం ఇంకా సక్సెస్ సాధించలేదు. ఇంతవరకు గ్రహాంతరవాసులు ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు? ఎలా ఉంటారు? ఇలాంటి అనుమానాలు ఇంకా అనుమానాలుగానే మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సరికొత్త ఆసక్తికర అంశాన్ని వెల్లడించింది. భూమికి చంద్రుడు ఉపగ్రహం అయినట్టే, శని గ్రహానికి కూడా ఎన్ సెలాడస్ అనే ఉపగ్రహం ఉందని తెలిపింది. దీనిమీద ఉన్న మంచును గుర్తించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మంచు కింద నీళ్లు కూడా ఉన్నాయని నాసా తెలిపింది.
అక్కడి నమూనాలు సేకరించి పరిశీలించగా, అందులో 98 శాతం నీళ్లు ఉన్నాయని తేలిందని నాసా వెల్లడించింది. మిగిలిన 2 శాతం కూడా హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్, మీథేన్ లాంటి వాయువులు ఉన్నాయని తెలిపారు. దీంతో ఇవన్నీ జీవం ఉందని చెప్పేందుకు సాక్ష్యాలేనని వారు అభిప్రాయపడుతున్నారు. సాధారణ జీవులు కూడా మీథేన్ ను తీసుకుని కార్బన్ డయాక్సైడ్ ను వదులుతాయని వారు తెలిపారు. దీంతో అక్కడ జీవం ఉందని చెప్పేందుకు సరైన సాక్ష్యం కోసం చూస్తున్నామని వారు వెల్లడించారు. సూక్ష్మజీవులు ఉపయోగించుకునే రసాయన ఇంధన వనరులు అక్కడ ఇప్పటికే లభ్యమయ్యాయని, అయితే మండే గుణమున్న ఫాస్పరస్, సల్ఫర్ అవశేషాలు లభ్యమవ్వలేదని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన సౌత్ వెస్ట్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్త హంటర్ వైట్ తెలిపారు.
బహుశా అవి చాలా తక్కువ మొత్తంలో ఉండటం వల్ల వాటిని తాము గుర్తించలేక ఉండవచ్చని ఆయన వెల్లడించారు. ఇతర గ్రహం మీద జీవం ఉనికిని కనుగొనడమే ఆసక్తికలిగించే అంశమైతే...ఎన్ సెలాడస్ మీద బ్యాక్టీరియా లాంటి చిన్న జీవులు ఉండే అవకాశం ఉందని గుర్తించడం మరింత ఆసక్తి దాయకమని, భూమి మీద జీవానికి అవసరమైన ప్రాధమిక వనరులు ఎలా ఉన్నాయో శనిగ్రహం చంద్రుడి మీద అవన్నీ ఉన్నాయని నాసా శాస్త్రవేత్త లిండా స్పిల్కర్ తెలిపారు. అయితే ఎన్ సెలాడస్ చాలా చిన్నదని చంద్రుడిలో కేవలం 15 శాతం పరిమాణంతో ఉంటుందని, అలాంటి ఉపగ్రహం మీద మానవ జీవానికి అవసరమైన ఉనికిని గుర్తించడం, దానిని నిర్ధారించడం గ్రహాంతరవాసులపై జరుగుతున్న పరిశోధనల్లో పెద్ద మైలురాయిగా భావించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.