: ఇదంతా బీజేపీ కుట్ర... అన్నా డీఎంకేలో చీలిక తేవడమే వారి లక్ష్యం!: సినీ నటి విజయశాంతి
తమిళనాడు రాజకీయాలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ శాసించాలని చూస్తోందని, అందులో భాగంగానే ఐటీ దాడులు చేయిస్తోందని, ఆర్కే నగర్ నియోజకవర్గ ఉపఎన్నికను రద్దు చేసిందని సినీ నటి విజయశాంతి తీవ్ర విమర్శలు చేశారు. చెన్నైలో ఓ టీవీ చానల్ తో మాట్లాడిన ఆమె, ఏఐఏడీఎంకేను బీజేపీ టార్గెట్ చేసిందని, మిగతా పార్టీలను పక్కనబెట్టిందని, ఏఐఏడీఎంకేలో చీలిక తేవడమే వారి లక్ష్యమని నిప్పులు చెరిగారు.
బీజేపీ అనేక రాష్ట్రాల్లో తలదూరుస్తోందని, ఎక్కడ బలహీనంగా కనిపించినా, అక్కడ చొచ్చుకుపోయేందుకు తనవంతు ప్రయత్నాలు సాగిస్తోందని వెల్లడించిన విజయశాంతి, అమ్మ చనిపోయిన తరువాత కుట్రలకు పాల్పడుతోందని, వాస్తవానికి అన్నాడీఎంకేలో చీలిక లేదని, అందరూ ఐకమత్యంగా ఉన్నారని తెలిపారు. కాగా, ఆర్కే నగర్ నియోజకవర్గంలో దాదాపు రూ. 70 కోట్లకు పైగా పంచారన్న వార్తలు, కొందరికి డబ్బు ఇస్తున్నప్పుడు తీసిన వీడియోలను పరిశీలించిన ఎన్నికల కమిషన్, ఉప ఎన్నికలను రద్దు చేసిన సంగతి తెలిసిందే.