: హైదరాబాద్‌లో జంతువులకూ శ్మశానవాటిక.. జీహెచ్ఎంసీ నిర్ణయం!
జంతు కళేబరాల కారణంగా నగరంలో దుర్గంధం వ్యాపిస్తుండడం, వాటిని ఎక్కడపడితే అక్కడ పడేస్తుండడంతో స్థానికుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో జంతువుల కోసం ప్రత్యేకంగా శ్మశానవాటికను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. గురువారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఇందుకు సంబంధించిన చర్చ వచ్చింది. మన్సూరాబాద్ కార్పొరేటర్ విఠల్‌రెడ్డి మాట్లాడుతూ జంతు కళేబరాలను పూడ్చిపెట్టకుండా ఆటోనగర్ పాత డంపింగ్ యార్డ్‌లో పడేస్తున్నారని, దీంతో ఎల్బీనగర్ అంతా దుర్గంధం వ్యాపిస్తోందని అన్నారు. ఈ కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు.
దీంతో స్పందించిన హెల్త్ అండ్ శానిటేషన్ అదనపు కమిషనర్ రవికిరణ్ మాట్లాడుతూ, ఫతుల్లాగూడలో క్రిమిటోరియం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇందుకోసం స్థలాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ప్రతిపాదనలు సిద్ధమైన తర్వాత మే 10 నాటికి టెండర్ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. మృతి చెందిన జంతువులను ఇక్కడ పూడ్చిపెడతామని పేర్కొన్నారు. అలాగే గాయపడిన జంతువులకు చికిత్స చేయడంతోపాటు వాటిని అక్కడ ఉంచేందుకు ప్రత్యేకంగా కాంపౌండ్లు నిర్మిస్తామని రవికిరణ్ వివరించారు.