: 2019 ఎన్నికల తర్వాత సీఎం నేనే.. జాగ్రత్తగా పనిచేయండి!: ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు జగన్ హెచ్చరిక

వైఎస్సార్ కాంగ్రెస్ చీఫ్, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నోటి వెంట మరోమారు ‘సీఎం నేనే’ అన్న పదం వినిపించింది. ఇటీవల తరచూ ‘నేనే సీఎం’ అంటున్న ఆయన తాజాగా గురువారం పులివెందుల నియోజకవర్గంలోని లింగాల ఎంపీడీవో కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఈ విషయం చెప్పి జాగ్రత్తగా ఉండాలని అధికారులను హెచ్చరించారు. మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన ఈ దర్బారులో మండలంలోని 16 పంచాయతీల ప్రజా ప్రతినిధులు, ప్రజలతో జగన్ విడివిడిగా సమావేశమయ్యారు. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో సత్వరమే ఆ సమస్యను పరిష్కరించాలని అధికారులకు జగన్ సూచించారు.
ఈ సందర్భంగా ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈపై పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు ఫిర్యాదు చేశారు. డబ్బుల కోసం వేధిస్తున్నారని ఆరోపించారు. డబ్బులిచ్చిన వారికే బిల్లులు త్వరగా వచ్చేలా చూస్తున్నారని, లేకుంటే కాళ్లరిగేలా తిప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. దీంతో స్పందించిన జగన్ ‘‘2019 ఎన్నికల తర్వాత పులివెందుల నియోజకవర్గానికే సీఎం పదవి వస్తుంది. మేం అధికారంలోకి వచ్చాక మీపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపిస్తా. ఇప్పటికైనా జరిగినవి మర్చిపోయి నిజాయతీగా పనిచేయండి’’ అని అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఇతర నేతలు, పలువురు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.