: ఈవీఎంల ట్యాంపరింగ్ జరగలేదు: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం)పై అభ్యంతరాలు తెలుపుతూ, భారతీయ జనతా పార్టీ ట్యాంపరింగ్‌కు పాల్పడుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్రపతికి సైతం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే, అదే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు మాత్రం ఈవీఎంల ట్యాంపరింగ్ జరగడం లేదని, తాము గెలిచి చూపించాంగా? అని అంటున్నారు. నిన్న రాత్రి పంజాబ్ సీఎం అమరీందర్ మాట్లాడుతూ... ఈవీఎంలను టాంపర్ చేసి ఉంటే తాను సీఎం కుర్చీలో కూర్చుండేవాడిని కాదని అన్నారు. అయితే, ఈ రోజు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా తమ పార్టీ తీరును స్పష్టంగానే చెప్పారు. ఇటీవల తమ రాష్ట్రంలో జరిగిన రెండు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఆ రెండు నియోజకవర్గాల్లో ఈవీఎం మెషీన్లను టాంపర్ చేయలేదు అని ఆయన వ్యాఖ్యానించారు. ఓ వైపు కాంగ్రెస్ అధిష్ఠానం ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఢిల్లీలో తీవ్ర ఆరోపణలు చేస్తోంటే ఆ పార్టీకి చెందిన సీఎంలే తమ రాష్ట్రాల్లో గెలవడంతో మరో విధంగా వ్యాఖ్యానిస్తుండడంతో కాంగ్రెస్ ధోరణి మరోసారి బయటపడిందని విమర్శలు వస్తున్నాయి.