: బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్ వ్యాఖ్యలపై పవన్ ఘాటుగా ట్వీట్లు!
దక్షిణ భారతీయులపై బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర భారతీయ నేతలు, బీజేపీపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన ట్వీట్ల ద్వారా ఘాటుగా స్పందించారు. ఆయా ట్వీట్లలో పవన్ ఏమన్నారంటే.. ‘దక్షిణ భారతీయులపై బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితం. ఈ వ్యాఖ్యల ద్వారా ఉత్తర భారత రాజకీయ నాయకుల, మేధావుల సంస్కారం ఎలాంటిదో అర్థమవుతోంది. ఈ వ్యాఖ్యలపై తరుణ్ విజయ్, బీజేపీ నేతలు నిజంగా క్షమాపణలు చెప్పాలని భావిస్తే... మన ద్రావిడ భాష ఒక్కటైనా సరే, వారు నేర్చుకోవాలి...’ అని పవన్ పేర్కొన్నారు.
మరో ట్వీట్ లో..‘ఒక రాష్ట్రం, అక్కడి ప్రజల అభివృద్ధి గురించిన విషయాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపై నడవాలి. ఉత్తర భారత కుట్ర నాయకత్వాన్ని ఎదిరించేందుకు దక్షిణ భారత రాజకీయ పార్టీలన్నీ ఏకమవ్వాలి. బీజేపీ నాయకత్వానికి, తరుణ్ విజయ్ కు నేనొక్కటే చెబుతున్నా...ఈ దేశానికి కింద భాగంలో మేము ఉన్నాం. ఈ దేశానికి పునాది మేమే.. మీ ఉత్తర భారత నాయకత్వం కాదు’ అని పవన్ ఘాటుగా ట్వీట్ చేశారు.