: ప్రేమించిన యువతి మోసం చేసిందని.. దొంగగా మారిపోయాడు!
ఓ యువతిని గాఢంగా ప్రేమించిన ఓ యువకుడు తాను మోసపోయానని తెలుసుకొని, అనంతరం దొంగగా మారి చోరీలకు పాల్పడుతున్న ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. మహిళల నుంచి బంగారం కాజేస్తోన్న విషయంపై నిఘాపెట్టిన పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేయగా అసలు విషయం బయటపడింది. ఈ యువకుడిని విచారించిన పోలీసులు పలు వివరాలు తెలిపారు. జిల్లాలోని గంగాధర మండలం గట్టుభూత్కూర్ గ్రామం వాసి అయిన కంకణాల తిరుపతిరెడ్డి అనే యువకుడు గతంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేసేవాడు. అక్కడ ఓ యువతితో పరిచయం పెంచుకొని కొన్నాళ్లు ప్రేమాయణం కొనసాగించాడు. అదే సమయంలో తిరుపతిరెడ్డి ఉపాధి నిమిత్తం దుబాయ్‌కి వెళ్లాడు. అతడి నుంచి ఆ యువతి తనకు అవసరం ఉందంటూ రూ.80 వేలు తీసుకుంది.
అయితే, తిరుపతిరెడ్డి స్వగ్రామానికి చేరుకునే లోపు తాను ప్రేమించిన యువతి కనిపించకుండా వెళ్లిపోయింది. దీంతో మోసపోయానని గ్రహించిన తిరుపతిరెడ్డి మద్యానికి బానిసయ్యాడు. మహిళలే లక్ష్యంగా చోరీలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే గతేడాది వినోద అనే మహిళ మెడలో పుస్తెల తాడుతో పాటు ఆమె ఇంట్లోని 20 గ్రాముల బంగారాన్ని చోరీ చేశాడు. ఈ ఏడాది పెండ్యాల యశోద అనే మహిళ ఇంట్లో 24 గ్రాముల పుస్తెల తాడు, మరో మహిళ ఇంట్లో 36 గ్రాముల బంగారం అపహరించాడు. చోరీ చేసిన బంగారంలో కొంత అమ్మి ఒక బైకు కొనుక్కుని, దానిపై తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తిరుపతిరెడ్డిని నిన్న పోలీసులు అరెస్ట్ చేసి, ద్విచక్ర వాహనంతో పాటు, 3 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.