: ఏం మాట్లాడితే, ఏం కొంప మునుగుతుందోనని టీడీపీ నేతలు భయపడుతున్నారు: బొత్స
ఏపీకి ఎంతో ముఖ్యమైన ప్రత్యేక హోదాపై తెలుగుదేశం పార్టీ ఎందుకు మౌనంగా ఉంటోందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు, టీడీపీ ఎంపీలంతా నోటికి ప్లాస్టర్లు వేసుకున్నారంటూ ఆయన విమర్శించారు. ఏం మాట్లాడితే, ఏం కొంప మునుగుతుందో అని భయపడ్డారని ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ జాతీయ పార్టీల ఎంపీలు, తెలంగాణ ఎంపీలు మాట్లాడినా... టీడీపీ ఎంపీలు మాత్రం విన్నకుండిపోయారని అన్నారు.
కాంట్రాక్టులు, కమిషన్ల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. రైతు సమస్యలను తీర్చడంలో కూడా టీడీపీ ప్రభుత్వం విఫలమయిందని ఎద్దేవా చేశారు. ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ, రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సత్సంబంధాలను సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. హైదరాబాదులోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ బొత్స ఈ వ్యాఖ్యలు చేశారు.