: బాలిక మృతితో.. చిన్నారుల అక్రమ రవాణా రాకెట్ గుట్టురట్టు!


తాను ప‌నిచేస్తోన్న అపార్ట్‌మెంట్‌లో ఓ 12 ఏళ్ల బాలిక మృతి చెంద‌డంతో చిన్నారులను కొనుగోలు చేస్తోన్న ఓ సంస్థ‌ గుట్టురట్టయింది. బెంగ‌ళూరులో వైద్యురాల‌యిన‌ గరీమా గోవర్ అనే మ‌హిళ ఇంట్లో ఫూల్‌ముని అనే ఓ బాలిక రెండేళ్లుగా ప‌నిచేస్తోంది. ఇటీవ‌లే ఆ బాలిక తాను పనిచేసే అపార్ట్‌మెంట్‌లో మృతి చెందింది. ఆమె భవనం 9వ అంతస్తు నుంచి పడిపోవ‌డంతో ప్రాణాలు కోల్పోయింద‌ని స్థానికులు చెప్పారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆ పాప‌ను ప‌నిలో పెట్టుకున్న‌ వైద్యురాలితో పాటు ఆమె భ‌ర్త‌ను అరెస్టు చేశారు.

ఇది ప్రమాదమా? లేక ఆత్మహత్యా? అన్న విష‌యాన్ని ఆరా తీస్తున్నారు. అయితే దర్యాప్తులో ఆ వైద్యురాలు చెప్పిన వివ‌రాలతో పిల్ల‌ల‌ను అక్ర‌మ‌ర‌వాణా చేసే ఓ సంస్థ గుట్టుర‌ట్ట‌యింది. ఢిల్లీలోని మిలాన్‌ ఎంటర్‌ప్రైసెస్‌ అనే ఏజెన్సీ నుంచి ఫూల్‌మునిని తాము నియమించుకున్నట్లు ఆ వైద్యురాలు చెప్పింది. అది అక్రమరవాణా అని పోలీసులు గుర్తించారు. ఆ సంస్థ చిన్నారులను తల్లిదండ్రుల నుంచి కొనుగోలు చేసి, వారిని ఢిల్లీకి తీసుకొస్తుందని పోలీసులు చెప్పారు. దీని వెనుక చాలా పెద్ద రాకెట్‌ ఉందని తెలిపారు. మిలాన్‌ ఎంటర్‌ప్రైసెస్‌పై ఇప్ప‌టికే దాడి చేసిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులోని ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో మృతి చెందిన బాలిక‌ తల్లిదండ్రుల చిరునామా కనుక్కున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని వారికి అప్ప‌గించారు. ఈ కేసులో విచార‌ణ కొన‌సాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News