: చాలా సిగ్గుగా ఉంది... బాధ్యత తీసుకుంటున్నా: ప్రయాణికుడిని విమానంలోంచి బయటకు లాక్కెళ్లడంపై సంస్థ చీఫ్
టికెట్ కొనుక్కొని విమానం ఎక్కిన ప్రయాణికుడిని, నోటి నుంచి రక్తం కారుతున్నా పట్టించుకోకుండా బయటకు లాక్కెళ్లిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ ఘటన తీవ్ర కలకలం రేపగా, సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆస్కార్ మునోజ్ స్పందించారు. ఘటన తరువాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన ఆయన, ఆ వీడియోను తాను చూశానని, చాలా సిగ్గుపడుతున్నానని, బాధితుడికి క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.
"మనం ఓ దుర్ఘటనను చూశాము. నేను బాధ్యత తీసుకుంటున్నా. భవిష్యత్తులో ఏ యునైటెడ్ విమానంలోనూ ఇలా జరుగకుండా చూసుకుంటాం" అన్నారు. జరిగిన ఘటన వెనుక బాధితుడు డేవిడ్ దావో తప్పేమైనా ఉందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ, "అతని తప్పు ఎంతమాత్రమూ లేదు. టికెట్ కొనుక్కొని వచ్చి తన సీటులోనే ఆయన కూర్చున్నారు. ఇలా జరగడం దురదృష్టకరం. ఎవరికీ ఇటువంటి అవమానం ఎదురు కాకూడదు" అన్నారు. ఘటనపై విచారణ జరిపిస్తున్నామని, పూర్తి వివరాలను ఏప్రిల్ 30 నాటికి అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
కాగా, ఈ ఘటన తరువాత, దావో తరఫు న్యాయవాదులు కుక్ కౌంటీ సర్క్యూట్ కోర్టులో పిటిషన్ వేశారు. ఆదివారం నాడు జరిగిన ఘటనకు సంబంధించిన బోర్డింగ్ ప్రాసెస్ ఫుటేజ్, కాక్ పిట్ వాయిస్ రికార్డులు, తమ క్లయింట్ ను ఈడ్చుకెళ్లిన దృశ్యాలను, పాసింజర్ల జాబితా, అమ్మిన టికెట్ల వివరాలు తదితరాలన్నీ అందించాలని డిమాండ్ చేశారు. ఇదిలావుండగా, యునైటెడ్ ఎయిర్ లైన్స్ పై భారీ మొత్తానికి దావా వేయాలని బాధితుడు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఘటనకు కారకులైన ఐదుగురిపై వేటు వేసిన యునైటెడ్ ఎయిర్ లైన్స్, మరో ముగ్గురిని విధుల నుంచి తాత్కాలికంగా పక్కకు తప్పించింది.