: ఆయేషా మీరా హత్యకేసులో ఎలా ముందుకెళ్దాం?: పోలీసు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు
విజయవాడలో పెనుసంచలనం రేపిన ఆయేషా మీరా హత్య కేసులో పునర్విచారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సత్యంబాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటించి, విడుదల చేసిన నేపథ్యంలో కేసును సుప్రీంకోర్టుకు అప్పీలు చేసే కంటే... హైకోర్టు ఆదేశిస్తే ఈ కేసును పునర్విచారణ చేయాలని నిర్ణయించారు. ప్రజా, మానవ హక్కుల సంఘాల డిమాండ్ మేరకు ఈ కేసును మళ్లీ విచారణ చేస్తేనే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చారు. అయితే హైకోర్టు ఆదేశాల అనంతరం మాత్రమే ఈ విషయంలో ముందుకు వెళ్లాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా, సత్యంబాబును నిర్దోషిగా పేర్కొంటూ, ఈ కేసు విచారించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.