: దేశంలో పరిస్థితి దిగజారుతోంది... జోక్యం చేసుకోవాలంటూ రాష్ట్రపతికి విపక్షాల విజ్ఞప్తి
దేశంలో పరిస్థితి దిగజారుతోందని...జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని విపక్షాలు కలిశాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో పలు పార్టీల నేతలు నిన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి వివిధ అంశాలపై ఫిర్యాదు చేశారు. దేశంలో గోసంరక్షకుల పేరిట అమాయక ప్రజలపై దాడులు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని, దీంతో దేశంలో పరిస్థితి అదుపు తప్పుతోందని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రపతి జోక్యం చేసుకొని పరిస్థితి చక్కదిద్దాలని వారు కోరారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారని వారు చెబుతూ, దేశంలో చోటుచేసుకున్న వివిధ ఘటనలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. దేశంలో భయం, అభద్రతాభావం నెలకొన్నాయని, ప్రజల ప్రాధమిక హక్కులు కాపాడాలని వారు రాష్ట్రపతికి సూచించారు. అలాగే ఎన్నికలలో వినియోగించే ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోందని వారు ఆరోపించారు.