: హైదరాబాద్ హోటళ్లలో పబ్లిక్ టాయిలెట్లు.. హోటల్‌లో తినకున్నా వినియోగించుకునే సౌకర్యం!
హైదరాబాద్‌లోని ప్రముఖ హోటళ్లలోని టాయిలెట్లు ఇక పబ్లిక్ టాయిలెట్లు కానున్నాయి. ఆయా హోటళ్లలో ఏమీ తినకున్నా ఎంచక్కా వాటిని వినియోగించుకోవచ్చు. అదీ ఉచితంగా! ఈ మేరకు జీహెచ్ఎంసీ పేర్కొంది. ఇప్పటికే పెట్రోల్ బంకుల్లోని టాయిలెట్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన జీహెచ్ఎంసీ ఇప్పుడు హోటళ్లపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా హోటళ్లలోని టాయిలెట్లను ప్రజోపయోగం కోసం వినియోగించాల్సిందిగా కోరగా పలు హోటళ్లు అంగీకరించాయి. బుధవారం జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి ఆదేశాలతో నగరంలో పర్యటించిన అధికారులు పలు హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలను ఒప్పించి అంగీకార పత్రాలను తీసుకున్నారు.
ఆయా హోటళ్లలో పబ్లిక్ టాయిలెట్ అందుబాటులో ఉన్న విషయం ప్రజలకు తెలిసేలా బోర్డులు కూడా ఏర్పాటు చేయనున్నారు. దాదాపు కోటి జనాభా ఉన్న నగరంలో 435 పబ్లిక్ టాయిలెట్లు, రూ.5 కోట్లతో ఏర్పాటు చేసిన 109 ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్లు అందుబాటులో ఉన్నాయి. 50 షీ టాయిలెట్ల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా వంద హోటళ్లలో పబ్లిక్ టాయిలెట్లను అందుబాటులోకి తీసుకురావాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు.
జీహెచ్ఎంసీ అభ్యర్థనతో.. సికింద్రాబాద్‌లోని చట్నీస్, ఆర్‌వీ స్పైసీ రెస్టారెంట్, మియాపూర్‌లోని హోటల్ బొమ్మరిల్లు, ఎల్బీనగర్‌లోని చట్నీస్, అంబర్‌పేటలోని డిజైర్ రెస్టారెంట్, ఉప్పల్‌లోని మాస్టర్ చెఫ్ రెస్టారెంట్, సంతోష్ దాబా, ఈద్ బజార్‌లోని హోటల్ అన్‌మోల్, మెయిన్‌బాగ్‌లోని అసీమ్ హోటల్, ఫాతిమా నగర్‌లోని షాలిమార్, సర్కిల్ -7లోని హోటల్ స్వాతి గ్రాండ్, షాగౌస్ హోటల్, హపీజ్ బాబానగర్‌లోని ఉమర్ రెస్టారెంట్, లకడీకాపూల్‌లోని హోటల్ ఫిష్ ల్యాండ్‌లు అంగీకరించాయి.