: పాక్ తీరును తప్పుబడుతున్న అమెరికా నిపుణులు.. జాదవ్ ఉరిశిక్ష నిర్ణయం విచిత్రంగా, ఆశ్చర్యకరంగా ఉందని వ్యాఖ్య!


భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ (46)పై గూఢచర్యం ఆరోపణలు మోపి ఉరిశిక్ష విధించడంపై అంతర్జాతీయంగా పలు విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో పాక్ ప్రభుత్వం, సైన్యం మధ్య కూడా భేదాభిప్రాయాలు తలెత్తినట్టు వార్తలొస్తున్నాయి. జాదవ్ విషయంలో ఆధారాలు లేవని పాక్ మీడియా సైతం ఆరోపిస్తోంది. మరోవైపు జాదవ్ ఉరిశిక్షపై ప్రపంచం విస్మయం వ్యక్తం చేస్తోంది. ఈ విషయంలో పాక్ తీరును అమెరికా నిపుణులు తీవ్రంగా నిరసిస్తున్నారు. కేసు విచారణలో పాక్ పారదర్శకంగా వ్యవహరించలేదని చెబుతున్నారు. అంతర్జాతీయంగా పాక్‌ను ఏకాకిని చేసేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు చెక్ చెప్పేందుకే జాదవ్‌ కేసును హడావిడిగా విచారించిందని అంటున్నారు.

ముంబై దాడుల కేసును తొమ్మిదేళ్లుగా విచారిస్తున్న పాక్, జాదవ్ విషయంలో వేగంగా స్పందించడం ఆశ్చర్యపరుస్తోందని అమెరికా విదేశాంగ శాఖలో దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాలు చూసిన మాజీ అధికారి అలిస్సా అయిర్స్ పేర్కొన్నారు.  జాదవ్ విషయంలో పాక్ చూపుతున్న ఆధారాలు చాలా బలహీనంగా ఉన్నట్టు వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే అట్లాంటిక్ కౌన్సిల్‌లోని దక్షిణాసియా కేంద్రం డైరెక్టర్ భరత్ గోపాలస్వామి అన్నారు. జాదవ్‌కు ఉరిశిక్ష నిర్ణయం, ప్రకటించిన సమయం చాలా విచిత్రంగా, ఆశ్చర్యకంగా ఉన్నాయని, దీనివల్ల పాక్‌కు ఎటువంటి ప్రయోజనం ఉండకపోవచ్చని స్టిమ్‌సన్స్ దక్షిణాసియా ప్రాజెక్ట్ డిప్యూటీ డైరెక్టర్ సమీర్ లల్వాణీ పేర్కొన్నారు.  

  • Loading...

More Telugu News