: డీఎన్ఏ పరీక్షకు నిరాకరించిన ధనుష్... కోర్టుకు తెలిపిన ధనుష్ న్యాయవాది
ప్రముఖ కోలీవుడ్ నటుడు ధనుష్ డీఎన్‌ఏ పరీక్షకు నిరాకరించాడు. ఈ మేరకు మరోసారి ధనుష్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ధనుష్ తమ కొడుకు అంటూ మధురై జిల్లా మేలూర్ కు చెందిన కదిరేశన్–మీనాక్షి దంపతులు మధురై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పెను కలకలం రేగింది. పుట్టుమచ్చలు పరిశీలించారు. ఆ విషయంలో కూడా వివాదం నెలకొంది. తాజాగా మరోసారి కదిరేశన్-మీనాక్షి దంపతులు ధనుష్ తమ కొడుకేనని నిరూపించేందుకు తాము డీఎన్‌ఏ పరీక్షకు సిద్ధం అని మరో పిటిషన్ ను దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరగగా వారి ఆరోపణల్లో నిజం లేదని, అందుకు ఆధారాలు తాము ఇప్పటికే కోర్టుకు సమర్పించామని ధనుష్ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. డీఎన్‌ఏ పరీక్షకు అంగీకరించేది లేదని, డీఎన్ఏ పరీక్ష ధనుష్ ఆత్మవిశ్వాసానికి, స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని ఆయన తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.