: ఒక్కో పార్టీకి ఒక్కో పిచ్చి ఉంటుంది.. మా పార్టీకి కూడా ఉంది: కేసీఆర్
ఒక్కో రాజకీయ పార్టీకి ఒక్కో పిచ్చి ఉంటుందని, తమ పార్టీకి కూడా ఒక పిచ్చి ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. తమది ప్రజల పార్టీ, ఉద్యమ పార్టీ అని తెలంగాణ ప్రజల సంక్షేమమే తమ పిచ్చని అన్నారు. ఈ రోజు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... ఉద్యమ సమయంలో ఎంతో మంది నేతలు ప్రత్యేక రాష్ట్రం ఎందుకని అన్నారని, తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగాలనే తాము పోరాడామని అన్నారు.
తెలంగాణలో రిజర్వేషన్లపై తాము చేస్తోన్న కృషిని పలువురు విమర్శిస్తున్నారని, 50 శాతం దాటకుండా రిజర్వేషన్లు ఉండాలని రాజ్యాంగంలో లేదని అన్నారు. మరో్వైపు ఇందిరా సహాని పిటిషన్‌పై 50 శాతం దాటి ఉండరాదని సుప్రీంకోర్టు చెప్పిందని, అయితే మరో సమయంలో ప్రత్యేక పరిస్థితి ఉంటే రిజర్వేషన్లు 50 శాతం దాటవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందని అన్నారు. 1980లో తమిళనాడులో 68 శాతం రిజర్వేషన్లకు శ్రీకారం చుట్టారని, 1990లో తమిళనాడులో ఎస్టీలకు ఒక శాతం పెంచి అమలు చేశారని అన్నారు. రాష్ట్రంలో తాము ఏ పార్టీతో పొత్తు లేకుండా గెలిచామని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వెళుతున్నామని, తమిళనాడులో కొనసాగుతున్న రిజర్వేషన్ల మాదిరిగానే తాము రిజర్వేషన్లు తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు.