: వేలంపాటలో రూ.68 వేలకు అమ్ముడుపోయిన 9 నిమ్మకాయలు!
తమిళనాడులో నిర్వహించిన ఓ వేలంపాటలో 9 నిమ్మకాయలు రూ. 68,100 ధర పలికాయి. ఈ నిమ్మకాయల విశిష్టత ఏంటని అనుకుంటున్నారా? ఆ నిమ్మకాయలను 10 రోజుల పాటు మురుగన్ ఆలయంలో ఉంచారు. 11వ రోజు అర్ధరాత్రి (నిన్న) ఆ నిమ్మకాయలను వేలం వేయగా ఇంతగా ధర పలికింది. తమిళనాడులోని విల్లుపురం జిల్లా ఒట్టనందల్ గ్రామంలోని పురాతన రత్నవేల్ మురుగన్ ఆలయంలో ఏటా కావడి ఉత్సవాలను నిర్వహిస్తారు. మురుగన్ వద్ద శూలానికి గుచ్చి ఉంచే 9 నిమ్మకాయలను ఇలా వేలం వేస్తారు.
వీటిని వేలంలో దక్కించుకున్న వ్యక్తి భార్య ఆ మరుసటి రోజు గింజలతో పాటుగా వాటిని తింటే సంతానం కలుగుతుందన్నది అక్కడి వారి నమ్మకం. అందులోని తొలి నిమ్మకాయను ఓ భక్తుడు రూ. 27 వేలకు కొనుక్కోగా.. రెండవ, మూడవ నిమ్మకాయలను మరో భక్తుడు ఒక్కొక్కటి రూ.6 వేలకు కొన్నాడు. ఇక నాలుగో నిమ్మకాయ రూ.5,800కు, ఐదవది రూ.6,300, ఆరవ నిమ్మకాయ రూ. 5 వేలకు, ఏడవది రూ. 5,600కు, ఎనిమిదవది రూ. 3,700, తొమ్మిదవది రూ. 2,700కు అమ్ముడు పోయాయి.