: సుమిత్రాజీ! మీరు కూడా దేవీ అహల్యాబాయి అంతటి వారు కావాలి!: టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి


లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ రోజు 73వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా లోక్ సభ సభ్యులు ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపారు. లోక్ సభ ప్రారంభం కాగానే సభ్యులందరూ నిలబడి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ లోక్ సభ సభ్యుల తరపున సుమిత్రా మహాజన్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా సుమిత్రా మహాజన్ తన కృతఙ్ఞతలు తెలియజేశారు. సభా నిర్వహణలో భాగంగా సభ్యులను అదుపు చేసే క్రమంలో ఒక్కోసారి మందలించాల్సి వస్తుందని .. ఇవేవీ పట్టించుకోవద్దని ఈ సందర్భంగా ఆమె పేర్కొనడం గమనార్హం.

అనంతరం, జరిగిన క్వశ్చన్ అవర్ లో టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి స్పీకర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సుమిత్రా మహాజన్ రాసిన ‘మాతో శ్రీ’ పుస్తకం ఆధారంగా పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో నిన్న ఓ ప్రదర్శన నిర్వహించారని, అది చాలా బాగుందని అన్నారు. ‘మీరు కూడా దేవీ అహల్యాబాయి అంతటి గొప్ప వ్యక్తి కావాలని నేను ఆశిస్తున్నాను’ అని ఈ సందర్భంగా స్పీకర్ ని ఉద్దేశించి జితేందర్ రెడ్డి అన్నారు. కాగా, మధ్య భారతదేశానికి చెందిన రాణి దేవీ అహల్యాబాయి హోల్కర్ జీవిత చరిత్ర ఆధారంగా ‘మాతోశ్రీ’ అనే పుస్తకాన్ని సుమిత్రా మహాజన్ రాశారు. ఈ పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నిన్న ఆవిష్కరించారు.

  • Loading...

More Telugu News