: సింహాచలం ఆలయంలో వినోదోత్సవం... భక్తులను ఆటపట్టించిన అర్చకులు!
విశాఖపట్టణం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో వినోదోత్సవంలో భాగంగా ఓ సరదా సంఘటన చోటుచేసుకుంది. అయితే, ఆ సంఘటన అనంతరం అసలు విషయం తెలుసుకున్న భక్తులు ఆశ్చర్యపోవడమే కాదు, ఆ ఉత్సవంలో తమకు అవకాశం దొరికినందుకు తమ జన్మ ధన్యమైందనుకున్నారు. అసలు ఏం జరిగిందంటే .. సింహాద్రి అప్పన్న ఆలయంలో దొంగలు పడ్డారని, స్వామి వారి ఉంగరం దోచుకెళ్లారంటూ ఆలయ అర్చకులు హడావుడి చేశారు.
స్వామి వారి దర్శనార్థం వచ్చిన భక్తులను అనుమానించారు. ఈ క్రమంలో కొందరు భక్తులను తాళ్లతో బంధించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటనతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. సదరు భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అక్కడి పోలీసులను కోరారు. అయితే, ‘మేము దేవుని ఉంగరం తీయడమేంటి?’ అని కొందరు భక్తులు ప్రశ్నించారు. చివరికి స్వామి వారి మేలి ముసుగు వస్త్రంలో ఉంగరం ఉందంటూ అర్చకులు చెప్పడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే, తమను అనుమానిస్తున్నారని ఆవేదన చెందిన భక్తులను ఆశ్చర్యపరుస్తూ, కాసేపటికి అర్చకులు ఓ ప్రకటన చేశారు. ఇదంతా అబద్ధమని, స్వామి వారికి నిర్వహించే వినోదోత్సవంలో భాగంగా ఈ నాటకం ఆడామని అర్చకులు చెప్పడంతో భక్తులు సంతోషానికి హద్దుల్లేవు.