: భారత వైద్యుల ఘనత.. రెండు నెలల్లో 242 కిలోలు తగ్గిన ఈమన్ అహ్మద్!


ఈమన్ అహ్మద్(36).. ఈజిప్ట్‌కు చెందిన ఈమె పేరు ప్రపంచం మొత్తానికి సుపరిచితం. అరటన్ను బరువుతో మంచానికే పరిమితమై మూడు దశాబ్దాలుగా బాహ్య ప్రపంచాన్ని చూడలేకపోయిన ఆమె గురించి తెలిసిన ప్రపంచం నివ్వెరపోయింది. ఆమెను తిరిగి సాధారణ స్థితికి తేవడం సాధ్యం కాదంటూ నిపుణులైన వైద్యులు చేతులెత్తేస్తే.. ఈమన్‌ను తాము సాధారణ స్థితికి తీసుకొస్తామంటూ ముంబైలోని సైఫీ ఆస్పత్రి ముందుకొచ్చింది. ఆమె కోసం ప్రత్యేకంగా అన్ని సౌకర్యాలతో రెండు కోట్ల రూపాయలతో భవనాన్నే కట్టించింది. బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ ముఫజల్ లక్డావాలా ఈమన్ బరువును తగ్గించే బరువు బాధ్యతలు నెత్తికెత్తుకున్నారు. దీంతో రెండు నెలల క్రితం ఈమన్ తన సొంత ఊరైన అలెగ్జాండ్రియా నుంచి ముంబైలో అడుగుపెట్టింది.

ముంబైలో అడుగుపెట్టినప్పుడు 498 కిలోలు ఉన్న ఈమన్ సరిగ్గా రెండు నెలల తర్వాత 242 కేజీలు తగ్గింది. స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ చేస్తున్న వైద్యులు ఆమెను నిత్యం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. మార్చి 7 నాటికి 130 కిలోలు తగ్గిన ఆమె ప్రస్తుతం 242 కిలోలు తగ్గినట్టు సైఫీ ఆస్పత్రి వైద్యుల బృందం తెలిపింది. ఈమన్ గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులు అన్నీ నియంత్రణలో ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈమన్ చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు ఆమెను నిరంతరం కనిపెట్టుకుని ఉంటున్న ఎండోక్రినాలజిస్ట్ షీలా షేక్ తెలిపారు.

  • Loading...

More Telugu News