: ‘పాక్ లో కుల్ భూషణ్కు మరణశిక్ష’పై స్పందించిన అమెరికా
భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాధవ్పై గూఢచర్యం ఆరోపణలు మోపుతూ, ఎటువంటి ఆధారాలు లేకుండా మరణశిక్ష విధించడంపై అమెరికా స్పందించింది. అంతర్జాతీయ వేదికపై తమ దేశాన్ని ఏకాకిగా నిలబెట్టాలన్న భారత్ దౌత్య చర్యలకు వ్యతిరేకంగా గట్టి సందేశం ఇచ్చేందుకే పాకిస్థాన్ కుల్ భూషణ్కు ఈ శిక్ష విధించాలనుకుంటోందని అమెరికా నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ చర్యతో భారత్-పాక్ దేశాల మధ్య ఉన్న సంబంధాలు మరింత దెబ్బతినవచ్చని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉద్రిక్తతలకు దారి తీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
కులభూషణ్పై విచారణను గందరగోళంగా చేసి, ఆధారాలు లేకుండానే ఆయనకు ఉరిశిక్ష వేయాలని పాక్ ఆర్మీ కోర్టు తీర్పు నివ్వడం పట్ల అమెరికాకు చెందిన దక్షిణ, మధ్య ఆసియా బ్యూరో మాజీ సీనియర్ అధికారి అలిస్సా అయ్రెస్ అభ్యంతరం తెలిపారు. ఇదిలా ఉండగా ముంబయి దాడుల కేసులో మాత్రం పాక్ విచారణను జాప్యం చేస్తుండడంపై ఆమె విస్మయం వ్యక్తం చేశారు. తమ దేశంపై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురాకుండా ఉండేలా హెచ్చరించేందుకే పాకిస్థాన్ కుల్ భూషణ్ విషయంలో ఇటువంటి చర్యకు దిగుతోందని ఆమె అన్నారు.