: ఐపీఎల్ లో పూణే జట్టుపై ఢిల్లీ డేర్ డెవిల్స్ నెలకొల్పిన అరుదైన రికార్డు
ఐపీఎల్ చరిత్రలో పూణే సూపర్ జెయింట్ జట్టుపై ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు అరుదైన రికార్డు నెలకొల్పింది. డేర్ డెవిల్స్ ఆటగాడు సంజు శాంసన్ సెంచరీ చేయగా, క్రిస్ మోరిస్ కేవలం 9 బంతుల్లో 30కి పైగా పరుగులు సాధించడంతో ఢిల్లీ జట్టు 97 పరుగుల భారీ ఆధిక్యంతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ మ్యాచ్ లో అరుదైన అంశం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ లో మొత్తం పది మంది ఆటగాళ్లను క్యాచ్ ద్వారా ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాళ్లు పెవిలియన్ కు పంపారు. రహానే జహీర్ బౌలింగ్ లో సంజు శాంసన్ క్యాచ్ పట్టగా, తరువాత మయాంఖ్ అగర్వాల్ ను జహీర్ బౌలింగ్ లో క్రిస్ మోరిస్ క్యాచ్ గా అవుట్ చేశాడు. డుప్లెసిస్ ను నదీం బౌలింగ్ లో రిషబ్ పంత్ క్యాచ్ అవుట్ చేశాడు. బెన్ స్టోక్స్ ను పాట్ కుమ్మిన్స్ బౌలింగ్ లో రిషబ్ పంత్ క్యాచ్ ద్వారా పెవిలియన్ కు పంపాడు. ధోనీని అమిత్ మిశ్రా బౌలింగ్ లో కరుణ్ నాయర్ పట్టేశాడు.
రజత్ భాటియాను అమిత్ మిశ్రా బౌలింగ్ లో క్రిస్ మోరిస్ పట్టేశాడు. చాహర్ ను జహీర్ బౌలింగ్ లో రిషబ్ పంత్ ఒడిసిపట్టేశాడు. ఆడమ్ జంపాను అమిత్ మిశ్రా బౌలింగ్ లో సంజు శాంసన్ క్యాచ్ అవుట్ చేశాడు. అశోక్ ధిండాను పాట్ కుమ్మిన్స్ బౌలింగ్ లో అమిత్ మిశ్రా క్యాచ్ పట్టడం ద్వారా పూణే ఇన్నింగ్స్ కు శుభం కార్డు పడింది. కేవలం 16.1 ఓవర్లలోనే పూణే ఆటగాళ్లంతా క్యాచ్ ల రూపంలో కేవలం 108 పరుగులు చేసి అవుటయ్యారు. దీంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు 97 పరుగుల తేడాతో విజయం సాధించి, అందర్నీ క్యాచ్ ల రూపంలో అవుట్ చేసిన జట్టుగా చరిత్రలో నిలిచిపోగా, క్యాచ్ ల రూపంలో ఆలౌటైన జట్టుగా పూణే చరిత్ర పుటల్లో స్థానం సంపాదించుకుంది.