: 'బీరు'కు ఫుల్ డిమాండ్... తెగ లాగించేస్తున్నారు!


ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపం పెరిగిపోతోంది. బయటకు వెళ్తే ఎండధాటికి తాళలేకపోతున్నారు. దీని నుంచి ఉపశమనం పొందేందుకు ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో యువత బీర్లు తెగ తాగేస్తున్నారు. ఎండలు పెరిగిపోతుండడంతో వేసవి తాపాన్ని తట్టుకునేందుకు బీర్లకు డిమాండ్ పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. వైరా డిపోనుంచి ఈ మూడు జిల్లాలకు మద్యం సరఫరా అవుతుంది. ఈ జిల్లాల్లో 144 మద్యం దుకాణాలు, 44 బార్లు, 3 క్లబ్బులుండగా, ప్రతినెలా సరాసరి 82 కోట్ల రూపాయల నుంచి 90 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి.

2016 ఏప్రిల్‌ లో అవిభాజ్య జిల్లాలో 86.65 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరుగగా, అందులో మెజారిటీ బీర్ విక్రయాలే కావడం విశేషం. అలాగే గతేడాది ఏప్రిల్‌ లో రికార్డు స్థాయిలో 2,36,370 కేసుల బీర్ల విక్రయాలు జరిగితే... ప్రస్తుతం ఈ నెల 11 తేదీ (నిన్నటికి) నాటికి 81,588 కేసుల బీర్ల విక్రయాలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.

గత ఏడాది ఏప్రిల్‌ మొత్తంలో 86.65 కోట్ల రూపాయల అమ్మకాలు జరుగగా ఈ ఏడాది ఏప్రిల్‌ 11వ తేదీ నాటికి 31.57 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయని అధికారులు చెబుతున్నారు. ఈ నెల చివరి నాటికి రికార్డు స్థాయి అమ్మకాలు జరిగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. ఇదే రీతిన అమ్మకాలు జరిగితే...రానున్న రోజుల్లో రేషన్ విధానం అమలు చేస్తామని, ప్రతి షాపుకు నిర్దేశించిన మేర సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు.

ప్రధానంగా బీర్లను గటగటా తాగేస్తుండడంతో డిమాండ్ ను బట్టి కాకుండా ప్రతి షాపుకు సమానంగా సరఫరా చేస్తామని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. 2016 మార్చిలో 88.29 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరగగా, 1,88,059 కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. 2017 మార్చిలో 90.90 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరగగా 1,82,747 కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. రానున్న రోజుల్లో వీటి అమ్మకాలు మరింత పెరుగుతాయని వారు చెబుతున్నారు. 

  • Loading...

More Telugu News