: ఇండియా న్యూస్ రీడర్ మనో ధైర్యానికి సెల్యూట్ చేసిన చైనా మీడియా!
జరిగిన ప్రమాదం తన భర్త కారుకే అని తెలుసు, మరణించింది తన భర్తే అని తెలిసినా గుండెల నిండా బాధ నిండుకున్నా, విధినిర్వహణే ప్రధానమని భావించి, ఆ బ్రేకింగ్ న్యూస్ తో కూడిన బులెటిన్ ను పూర్తి చేసి మరీ ఇంటికి వెళ్లిన ఛత్తీస్ గఢ్ లోని ఐబీసీ-24 న్యూస్ రీడర్ సుప్రీత్ కౌర్ నిబద్ధతను చైనా మీడియా ఆకాశానికెత్తింది. చైనాకు చెందిన పీపుల్స్ డైలీ, చైనా డైలీ, గ్లోబల్ టైమ్స్, షింగ్జువా న్యూస్ ఏజెన్సీతో పాటు పలువురు మీడియా ప్రతినిధులు ఆమె గుండె ధైర్యాన్ని మెచ్చుకున్నారు.
ఆమె కథనాన్ని చైనా మీడియా సంస్థలన్నీ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసి, ఆమె చదివిన న్యూస్ బులెటిన్ ను ఉంచగా, ఆమె తెగువను కొనియాడుతూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. ‘కౌర్ తన వృత్తిని దైవంలా భావిస్తున్నారని’ కొంత మంది, ‘ఆమె గాథ వింటుంటేనే ఏడుపొచ్చేసింది’ అంటూ మరికొందరు, ‘ఆమె చాలా ధైర్యవంతురాలు’ అని ఇంకొందరు, ‘సుప్రీత్ మనోధైర్యానికి సెల్యూట్’ అంటూ ఇంకొందరు నెటిజన్లు ఆమెను ప్రశంసించారు.