: కుల్ భూషణ్ జాదవ్ ను పాక్ చంపేసిందా? అందుకే ఉరిశిక్ష డ్రామా ఆడుతోందా?
పాకిస్థాన్ చేతుల్లో బందీగా మారి ఉరిశిక్ష విధించబడ్డ భారత నావికాదళ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ అసలు బతికి ఉన్నారా? అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఇదే అనుమానాన్ని బీజేపీ ఎంపీ, హోం శాఖ మాజీ కార్యదర్శి ఆర్.కె.సింగ్ వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, కుల్ భూషణ్ జాదవ్ ను పాక్ చిత్రహింసలు పెట్టి చంపేసి ఉండొచ్చని అన్నారు. ఆ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు ఉరిశిక్ష అంటూ పాకిస్థాన్ కట్టుకథ అల్లుతోందని ఆయన ఆరోపించారు. అలా జరిగి ఉండకపోతే 13 సార్లు భారత్ చేసిన విజ్ఞప్తిని పాక్ పరిగణనలోకి తీసుకునేదని అన్నారు. ఆయనను చిత్రహింసలు పెట్టి చంపేశారు కాబట్టే కుల్ భూషణ్ జాదవ్ ను కలుసుకునేందుకు భారత రాయబార కార్యాలయానికి పాక్ అనుమతి ఇవ్వడం లేదని అన్నారు.
భారత్ విజ్ఞప్తిని పాక్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చడం చూస్తుంటే కుల్ భూషణ్ జాదవ్ ఇక లేరనే అభిప్రాయం దృఢపడుతోందని ఆయన స్పష్టం చేశారు. ఆయన బతికి ఉన్నాడా? లేదా? అన్నది నిర్ధారించేందుకు భారత రాయబార కార్యాలయానికి అనుమతి ఇవ్వాలంటూ మరోసారి గట్టిగా పాక్‌ను భారత ప్రభుత్వం డిమాండ్ చేయాలని ఆయన సూచించారు. ఆ పని వెంటనే చేయాలని ఆయన కేంద్రానికి సూచించారు. లేని పక్షంలో కుల్ భూషణ్ జాదవ్ ను ఉరి తీసేసామంటూ పాకిస్థాన్ రేపే ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.