: అమెరికా అధ్యక్షుడి మోడలింగ్ ఏజెన్సీ మూత పడింది!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఉన్న పలు వ్యాపారాల్లో మోడలింగ్ ఏజెన్సీ కూడా ఒకటి. 'ట్రంప్ మోడల్స్' పేరుతో ఈ ఏజెన్సీ గతంలో విజయవంతంగా కొనసాగింది. ఇప్పుడు ఇది మూతపడింది. అయితే, ఎందువల్ల మూసివేశారన్న విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. ఇప్పటిదాకా ఈ సంస్థకు మేనేజర్ గా వ్యవహరించిన వ్యక్తి... ఇక్కడ నుంచి తప్పుకుని సొంతంగా ఓ ఏజెన్సీ ప్రారంభించాడని ఓ మీడియా సంస్థ వెల్లడించింది. అంతేకాదు, ట్రంప్ సంస్థలో ఉన్న చాలా మంది మోడల్స్ ను కూడా సదరు మేనేజర్ తనతో పాటే తీసుకెళ్లిపోయాడట. మరోవైపు, ఈ ఏజెన్సీకి సరైన ప్రాజెక్టులు రావడం లేదని కూడా కొందరు చెబుతున్నారు. 1999లో ఈ మెడలింగ్ ఏజెన్సీని ట్రంప్ ప్రారంభించారు. జెర్రీ హాల్, యాస్మిన్ లీబాన్, విరోనికా వెబ్, కార్మెన్ డెలోరిఫీస్ వంటి ఎంతో మంది ప్రఖ్యాత మోడళ్లు ఈ ఏజెన్సీ ద్వారానే పాప్యులర్ అయ్యారు.