: ప్రేమించి పెళ్లి చేసుకున్న మూడు నెలలకే యువతి మృతి
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువతి మూడు నెలలు కాకముందే మృతి చెందిన ఘటన పొన్నలూరు మండలం పైరెడ్డిపాలెంలో చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన సానా సాంధురెడ్డి, కృష్ణవేణి దంపతుల మూడవ కూతురు శిరీష(19) అదే గ్రామంలోని కర్ణా హరికృష్ణారెడ్డి అనే యువకుడితో ప్రేమలో పడింది. అయితే, పెళ్లి చేసుకునేందుకు ఆ యువకుడు మొదట ఒప్పుకోలేదు. దీంతో శిరీష తల్లిదండ్రులు ఆ యువకుడు మంచివాడు కాదని, అతడితో పెళ్లి వద్దని చెప్పారు. కానీ, శిరీష మాత్రం తాను ప్రేమించిన వాడే కావాలని పంతం పట్టింది. దీంతో ఇరు కుటుంబాల పెద్దలు వారిద్దరికీ ఎట్టకేలకు పెళ్లి చేశారు. పెళ్లి కూతురు తల్లిదండ్రులు 10 లక్షల రూపాయల కట్నంతో పాటు ఇతర లాంఛనాలు కూడా ఇచ్చుకున్నారు.
అయితే, నిన్న శిరీష మెట్టినింట్లో మృతి చెందింది. మధ్యాహ్నం తాను పొలం నుంచి ఇంటికి వచ్చేసరికి తన భార్య ఇంటి తలుపులకు గడియ వేసుకుని చీరతో ఉరేసుకుని కనిపించిందని హరికృష్ణారెడ్డి అన్నాడు. తలుపులు పగులకొట్టి ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు చెప్పారని ఆయన చెప్పాడు. అయితే, తమ కుమార్తెను హరికృష్ణారెడ్డే చంపాడని శిరీష కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడంతో హరికృష్ణారెడ్డి శిరీషను వేధించాడని, తమ కూతురి ప్రవర్తనపై అనుమానంగా మాట్లాడేవాడని అన్నారు.
అయితే, హరికృష్ణారెడ్డి మరోలా వాదిస్తున్నాడు. బెంగళూరులో ఉంటున్న శిరీష తల్లి గ్రామంలో కోదండరామస్వామి తిరునాళ్లకు ఆదివారం సాయంత్రం వచ్చిందని, ఈ సందర్భంగా తమను ఇంటికి రావాలని ఆహ్వానించిందని అన్నాడు. అయితే, తన తల్లి వద్ద తీసుకున్న రూ.60 వేలు అప్పు తీర్చితేనే ఇద్దరం వెళ్దామని శిరీష తనతో చెప్పిందన్నారు. ఈ క్రమంలోనే చీరతో ఉరి వేసుకుందని అంటున్నాడు. తాము ఇంటికి వచ్చి చూసేసరికి ఆమె దూలానికి వేలాడుతూ ఉందని, పొడవుగా ఉన్న కర్రకు కొడవలి కట్టి ఆమె ఉరివేసేందుకు ఉపయోగించిన చీరను కత్తిరించడంతో ఆమె పక్కనే ఉన్న మంచంపై పడిపోయిందని చెప్పాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.