: అందంగా లేనని, అమ్మాయిలు చూడడం లేదని... అత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్థి!


అందంగా లేనన్న ఆత్మన్యూనతా భావంతో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి- భువనగరి జిల్లాలోని బీబీనగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, సహ విద్యార్థుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం సాయిగూడ గ్రామానికి చెందిన గుగులోతు గోపిచంద్ (21) బీబీనగర్ గూడూరు శివారులోని తూడి రాంరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తాను అందంగా లేకపోవడంతో ఎవరితోనూ కలవలేకపోతున్నానని, అమ్మాయిలకు తాను నచ్చడం లేదని గతకొంత కాలంగా మనోవేదనకు గురవుతున్నాడు.

ఈ క్రమంలో గత డిసెంబరులో ఓసారి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో స్పందించిన కాలేజీ యాజమాన్యం గోపిచంద్‌కు రెండుసార్లు కౌన్సెలింగ్ ఇప్పించింది. అయినా గోపిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. తన బాధను హాస్టల్ గోడలపైనా, పుస్తకాల్లోనూ రాసుకునేవాడు. ఈ నేపథ్యంలో జీవితంపై విరక్తి చెందిన గోపి ఆదివారం రాత్రి హాస్టల్‌లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను అందంగా లేనని, ఎవరితోనూ కలవలేకపోతున్నానని, అమ్మాయిలకు నచ్చడం లేదని, అందుకే చనిపోతున్నానంటూ సూసైడ్ నోట్ రాశాడు. తన చావుకు ఎవరూ బాధ్యులు కారని, జీవితంపై విరక్తితోనే చనిపోతున్నట్టు అందులో పేర్కొన్నాడు. అమ్మానాన్న తనను క్షమించాలని వేడుకున్నాడు. అయితే సూసైడ్ నోట్‌లో రెండురకాల చేతి రాతలు ఉండడంతో పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News