: ‘‘బాబుకు ఝలక్ ఇచ్చిన బీకాం ఫిజిక్స్ ఖాన్’ వీడియోపై స్పందించిన జలీల్ ఖాన్!
ఇటీవల జరిగిన ఏపీ మంత్రి వర్గ విస్తరణలో తమకు అవకాశం లభించలేదని అధికార పార్టీ సీనియర్ నేతలు అలక బూనిన విషయం తెలిసిందే. అదే క్రమంలో, వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా మంత్రి పదవి వస్తుందని ఆశించారనే వార్తలూ హల్ చల్ చేశాయి. దీంతో, జలీల్ ఖాన్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో ‘బాబుకు ఝలక్ ఇచ్చిన బీకాం ఫిజిక్స్ ఖాన్’ పేరిట ఓ వీడియోను పోస్ట్ చేశారనే వదంతులు వ్యాపించాయి. అయితే, ఈ వీడియోను తాను పోస్ట్ చేశానంటూ వచ్చిన వార్తలను జలీల్ ఖాన్ ఖండించారు.
ఈ విషయమై ఓ న్యూస్ ఛానెల్ ఆయన్ని ప్రశ్నించగా.. ‘బుద్ధి, ఙ్ఞానం లేని వాళ్లు, ఎదురొచ్చి మాట్లాడలేనివాళ్లు, వెనుక ఉండి సంసారాలు చెడగొట్టేవాళ్లు, సమాజంలో పేరు లేని వాళ్లు, సమాజం ధిక్కరించిన వాళ్లు .. ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో, యూ ట్యూబ్ లలో పెడతారు. నిజంగా, దమ్మూధైర్యం ఉన్న వాళ్లు ధైర్యంగా మాట్లాడతారు’ అని చెప్పుకొచ్చారు.