: ఆర్కే నగర్ ప్రజలంతా నా వెంటే.. ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా విజయం నాదే: దినకరన్
చెన్నైలోని ఆర్కే నగర్ ఉప ఎన్నికలో శశికళ వర్గం కోట్లాది రూపాయలను ఓటర్లకు పంచిందనే విషయం నిర్ధారణ కావడంతో... ఉప ఎన్నికను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో, అక్కడ నుంచి అన్నాడీఎంకే తరపున పోటీ చేస్తున్న దినకరన్ మాట్లాడుతూ ఈసీ చాలా పెద్ద తప్పిదానికి పాల్పడిందంటూ మండిపడ్డారు. ఆర్కే నగర్ ప్రజలంతా తన వెంటే ఉన్నారని... ఉప ఎన్నిక ఎప్పుడు నిర్వహించినా విజయం తనదే అని ఆత్మ విశ్వాసం వ్యక్తం చేశారు. మాజీ సీఎం పన్నీర్ సెల్వం వర్గీయులు కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. తాము ఎవరికీ డబ్బులు పంచలేదని చెప్పారు. మరోవైపు, డబ్బు పంపిణీపై సీబీఐ చేత విచారణ చేయించాలంటూ డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ డిమాండ్ చేశారు.