: మేము ఎలా బదులివ్వగలమో అమెరికాకు బాగా తెలుసు: రష్యా, ఇరాన్ ఆర్మీ చీఫ్‌లు
సిరియాలో జరిగిన రసాయనిక దాడికి ప్రతీకారం అంటూ అమెరికా ఇటీవల ఆ దేశంలోని షైరత్ వైమానిక స్థావరంపై క్షిపణులతో దాడులు చేయడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయాయి. సిరియా అధ్యక్షుడు అసద్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోన్న రష్యా, ఇరాన్ లు అమెరికాపై మండిపడుతున్నాయి. సిరియా ప్రభుత్వ సేనలపై అమెరికా ఇటువంటి చర్యలే మళ్లీ కొనసాగిస్తే తాము సైనిక దాడులతో బదులిస్తామని తెలిపాయి. ట్రంప్ రెడ్‌లైన్‌ను దాటారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇకపై మాత్రం రెడ్‌లైన్ దాటితే ఊరుకునేది లేదని హెచ్చరించాయి.
తాము ఎలా బదులివ్వగలమో అమెరికాకు బాగా తెలుసని రష్యా, ఇరాన్ ఆర్మీ చీఫ్‌లు ఒక ఉమ్మడి ప్రకటనలో అన్నారు. ఇదే సమయంలో లండన్‌లో రష్యా రాయబార కార్యాలయం స్పందిస్తూ.. సిరియా విషయంలో రష్యాకు అల్టిమేటం ఇస్తే ఇక అసలైన యుద్ధం తప్పదని అమెరికాను హెచ్చరించింది.