: డల్లాస్ వాసులను బెంబేలెత్తించి... నిద్రలేకుండా చేసిన హ్యాకర్!
అమెరికాలోని డల్లాస్ నగరవాసులను బెంబేలెత్తించి... నిద్రలేకుండా చేశాడో హ్యాకర్. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే... డల్లాస్ నగరంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు.. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వం అత్యవసర సేవల వ్యవస్థను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా నగరవ్యాప్తంగా సైరన్లు ఏర్పాటు చేశారు. ఈ సైరన్లు మోగాయంటే అత్యవసర పరిస్థితి ఏర్పడిందని, తొందరపడి ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించినట్టు గుర్తిస్తారు. ఈ వ్యవస్థను హ్యాక్ చేసిన ఓ దుండగుడు.. ఒకేసారి 156 అత్యవసర సైరన్లను మోగించాడు.
రాత్రి 11:42 నుంచి అర్థరాత్రి 1:17 నిమిషాల వరకు సుమారు గంటన్నరపాటు అర్ధ రాత్రి సమయంలో ఒక్కసారిగా సైరన్లు మోగడంతో డల్లాస్ వాసులు ఆందోళనకు గురయ్యారు. అర్ధరాత్రి నగరంలో ఎక్కడ ఏం జరిగిందో తెలియక టీవీలు ఆన్ చేసి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. మరికొందరు స్నేహితులు, బంధువులకు ఫోన్ చేసి దానిపై సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే కంప్యూటర్ తో అనుసంధానమై ఉండే ఈ సిస్టమ్ హ్యాకింగ్ కు గురైందని అధికారులు గుర్తించారు. అయితే హ్యాకర్ ఎవరు? అన్నది ఇంకా కనిపెట్టలేదని తెలుస్తోంది. దీంతో డల్లాస్ వాసులకు ఒక రాత్రి నిద్రను హ్యాకర్ దూరం చేశాడు.