: తగినంత భోజనం వండలేదని గొడవ.. పెళ్లి వద్దన్న వధువు
తమ తరఫు బంధువులకి తగినంత భోజనం వండకపోవడంతో వరుడి కుటుంబ సభ్యులు అలిగి గొడవకు దిగడంతో వారి తీరుకి నొచ్చుకున్న వధువు తాను ఆ పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. ఆమెకు నచ్చ జెప్పేందుకు ఇరు కుటుంబ సభ్యులు ఎంతగా ప్రయత్నించినా ఆమె వినిపించుకోలేదు. దీంతో పెళ్లి ఆగిపోయింది. కర్ణాటకలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. కోణనెకుంటెలోని సౌదామిని కల్యాణ మండపంలో నాగేంద్రప్రసాద్ అనే యువకుడు నిన్న ఓ యువతి మెడలో మూడు ముళ్లు వేయాల్సి ఉంది. మొన్న రాత్రి అదే కల్యాణ మండపంలో వీరికి రిసెప్షన్ ఏర్పాటు చేయగా.. వరుని తరపు వచ్చిన బంధువుల్లో 30 మందికి భోజనం దొరకలేదు.
దీంతో వరుడి కుటుంబ సభ్యులు నొచ్చుకున్నారు. తమ బంధువుల ముందు తమను అవమానించారని వధువు తల్లిదండ్రులతో గొడవపడ్డారు. పెళ్లి కొడుకు తరఫు కుటుంబ సభ్యులు తమతో ముందుగా చెప్పిన బంధువుల సంఖ్య కన్నా ఎక్కువ మంది వచ్చారని వధువు తల్లిదండ్రులు అన్నారు. అయితే, వరుడి తల్లిదండ్రులు వారి మాట పట్టించుకోకుండా అర్ధరాత్రి వరకు గొడవ చేశారు. చివరకు వరుడి తల్లిదండ్రులు జరిగిందేదో జరిగిందిలే అన్నారు. అయితే, వారి ప్రవర్తనతో వధువుకి కోపం వచ్చేసింది. వరుడి తరపున హాజరవుతారని చెప్పిన బంధువుల సంఖ్యకు, ఫంక్షన్‌కు వచ్చిన వారి సంఖ్యకు పొంతనే లేదని ఆమె వాదించింది.
రాత్రిపూట ఇలా గొడవకు దిగడమేంటని పెళ్లి కూతురు మండిపడింది. పెళ్లికొడుకు తరఫు బంధువులకి వంట చేసి భోజనం పెడతామన్నప్పటికీ వారు అంగీకరించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక నాగేంద్ర ప్రసాద్‌ను పెళ్లాడితే తాను జీవితాంతం ఇలానే బాధ పడాల్సి ఉంటుందని చెప్పింది. ఆయనను తాను పెళ్లి చేసుకోబోనని తెగేసిచెప్పింది.