: అనంతపురం జిల్లాలో దారుణం... కారులో తిప్పుతూ మూడు రోజుల పాటు బాలికపై అత్యాచారం!


అనంతపురం జిల్లా గుత్తిలో అంత్యంత హేయమైన ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలో జరిగే సంఘటనల్లాంటి ఘటన ఈ పట్టణంలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుత్తి జంగాల కాలనీకి చెందిన పదమూడేళ్ల బాలిక స్థానిక ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఈ నెల 5వ తేదీన సాయంత్రం ఆరు గంటల సమయంలో రామాలయానికి వెళ్లింది. స్వామివారిని దర్శించుకున్న అనంతరం రాత్రి 7.30 గంటల సమయంలో ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా, ఆమె ఉంటున్న బుడగ జంగం కాలనీకి చెందిన అశోక్, యంగన్నపల్లికి చెందిన సురేష్‌ ఆమెను అటకాయించి, నోట్లో గుడ్డలు కుక్కి కారులో ఎత్తుకెళ్లారు. గుడి కెళ్లిన బాలిక పొద్దుపోయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించి, దొరకకపోవడంతో ఆందోళనతో పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కూడా ఆమె ఆచూకీ కనుగొనలేకపోయారు.

ఈ క్రమంలో కిడ్నాప్ అయిన మూడు రోజుల తరువాత ఈనెల 8న తెల్లవారుజాము 3 గంటల సమయంలో గుత్తిలోని రవితేజ హోటల్‌ వద్ద కిడ్నాపర్లు బాలికను వదిలివెళ్లారు. దీంతో ఎలాగోలా ఇంటికి చేరిన బాలిక, తల్లిదండ్రులతో కలసి పోలీస్ స్టేషన్‌ కు వెళ్లి... కిడ్నాప్‌ చేసిన అనంతరం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారం చేశారని చెప్పింది. మూడు రోజులపాటు కారులో నిర్బంధించి వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారం కొనసాగించారని, తర్వాత కారులోనే తీసుకొచ్చి గుత్తిలోని రవితేజ హోటల్‌ వద్ద వదిలేసి వెళ్లిపోయారని విలపిస్తూ జరిగిన దారుణాన్ని పోలీసులకు వివరించింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఉంటున్న బుడగజంగం కాలనీకి చెందిన అశోక్ గుత్తిలోని అన్నపూర్ణ హోటల్లో వంటమనిషి అని, మరో నిందితుడు సురేష్‌ ఆటోడ్రైవర్‌ అని తేల్చారు. దీంతో వారిద్దరిపై నిర్భయ చట్టంతో పాటు సెక్షన్‌ 366 (కిడ్నాప్‌), 342 (నిర్బంధం), 376 బీ (అత్యాచారం), 109 (అత్యా చారాన్ని ప్రోత్సహించడం), 5 లేదా 6 (పోక్సో– నిర్భయ చట్టం) కింద కేసు నమోదు చేశారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News