: ధోనీ ప్రదర్శనపై పూణే యజమాని సోదరుడి ట్వీట్లు... అభిమానుల ఆగ్రహం!
ఐపీఎల్ లో పూణే సూపర్ జెయింట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ తో యాజమాన్యం విభేదాలు ఇంకా సమసిపోనట్టు కనిపిస్తోంది. తాజాగా పూణే సూపర్ జెయింట్ జట్టు యజమాని సంజయ్ గోయెంకా సోదరుడు హర్ష్ గొయెంకా చేసిన ట్వీట్లు ధోనీ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. కేవలం రెండు మ్యాచ్ లకే ధోనీ ఆటతీరుపై ఒక అంచనాకు వచ్చి ట్వీట్లు చేయడం కలకలం రేపింది. తన ట్విట్టర్ ఖాతాలో హర్ష్ ‘‘అడవిలో రాజెవరో స్మిత్ రుజువు చేశాడు. అతడు ధోనీని మరుగున పడేలా చేశాడు. ఇది కెప్టెన్ ఇన్నింగ్స్. కెప్టెన్ గా స్మిత్ ను నియమించడం గొప్ప నిర్ణయం’’ అని రుజువు చేశాడు అంటూ ట్వీట్ చేశారు.
దీంతో ధోనీ అభిమానులు ఆగ్రహంతో 'ఇంకా సీజన్ ఆరంభంలోనే ఉంది, అయినా ఒకటి లేదా రెండు ఇన్నింగ్స్ ఆధారంగా ధోనీ లాంటి ఆటగాడిపై అనుచిత వ్యాఖ్యలు అవసరమా?' అంటూ సున్నితంగా విమర్శించారు. దీనికి ఏమాత్రం వెనుకడగు వేయని హర్ష్... ఈ సీజన్ గణాంకాలను చూపిస్తూ, ధోనీ స్ట్రయిక్ రేట్ తక్కువగా ఉందని ఎత్తిపొడిచాడు. దీంతో మరింత మండిపడ్డ ధోనీ అభిమానులు ఐపీఎల్ లో ధోనీ గణాంకాలను చూపిస్తూ... రెండు ఇన్నింగ్స్ లలో ఆడింది మాత్రమే ధోనీ ప్రదర్శన కాదని... ఇదంతా ధోనీ ప్రదర్శన అని ఘాటుగా విమర్శలు చేశారు. దీంతో ధోనీ వర్సెస్ పూణే యాజమాన్యంగా ఉన్న వివాదం పూణే యాజమాన్యం వర్సెస్ ధోనీ అభిమానులుగా మారింది.