: అద్భుత పోరాటంతో కోల్ కతా చేతుల్లోని మ్యాచ్ ను లాగేసుకున్న నితీష్ రాణా... ముంబై తొలి విజయం
ఐపీఎల్ 10వ సీజన్ లో సొంత గడ్డపై ముంబై ఇండియన్స్ జట్టు బోణీ చేసింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో సొంత అభిమానుల మధ్య జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుపై విజయం సాధించి సత్తాచాటింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతాను ముంబై ఇండియన్స్ బౌలర్లు అద్భుతంగా నిలువరించారు. దీంతో కొల్ కతా ఆటగాళ్లలో కేవలం మనీశ్ పాండే (81) మాత్రమే సమర్ధవంతంగా ఆడాడు. బౌలర్ ఎవరు అన్నది చూడకుండా సిక్సర్లు, బౌండరీలతో అలరించాడు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 178 పరుగులు చేసింది.
అనంతరం 179 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టు కు ఓపెనర్లు పార్థివ్ పటేల్ (30), జోస్ బట్లర్ (28) శుభారంభం ఇచ్చారు. వీరు అవుట్ కాగానే కెప్టెన్ రోహిత్ శర్మ (2) కూడా విఫలమయ్యాడు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు కష్టాల్లో పడింది. మ్యాచ్ కోల్ కతా చేతుల్లోకి వెళ్లింది. ఈ దశలో నితీశ్ రాణా (50- 29 బంతుల్లో 5×4, 3×6) అసాధారణ పోరాటపటిమతో దూకుడు ప్రదర్శించాడు. అయితే చివర్లో నితీష్ రాణా ఆరోవికెట్ గా వెనుదిరగడంతో మరోసారి మ్యాచ్ మలుపు తిరిగిందని భావించేంతలో హార్దిక్ పాండ్య మెరుపులు ముంబై ఇండియన్స్ ను విజయతీరాలకు చేర్చింది. దీంతో సొంత గడ్డపై ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో తొలి విజయం రుచిచూసింది.