: విరాట్ కోహ్లీ అంటే కొన్ని సందర్భాల్లో నాకు భయం: అశ్విన్
ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ సీజన్‌కి టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. గాయం కారణంగా ఐపీఎల్ ఆడలేకపోతున్న అశ్విన్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుత కెప్టెన్ కోహ్లీలలో తాను ఎవరితో ఎక్కువగా కలిసిపోతానన్న విషయంపై ఆయన స్పందిస్తూ... విరాట్ కోహ్లీ అంటే తనకు కొన్ని సందర్భాలలో భయమని తెలిపాడు. ఫీల్డింగ్ సెట్ చేయడంలో ఇది స్పష్టంగా కనిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించాడు. పలుసార్లు మైదానంలో తన వద్దకు వచ్చి పలానా పొజిషన్లో ఉన్న ఫీల్డర్ ను ఎందుకు తీసేశావని తనను అడిగాడని చెప్పాడు.
ఇక భారత అభిమానులంతా ధోనీయే మరింత కాలం సారథ్య బాధ్యతలు నిర్వర్తించాలని కోరుకుంటున్నారని అశ్విన్ అన్నాడు. తాను ధోనీ సారథ్యంలో సుమారు ఐదేళ్లు ఆడానని, ఆయన ఎంతో అనుభవంతో మంచి నిర్ణయాలు తీసుకుంటాడని, ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాడని అన్నాడు.