: అందుబాటులో లేని వ్యక్తికి వాట్సప్ ద్వారా సమన్లు!
ఓ కేసు విషయంలో అందుబాటులో లేని వ్యక్తికి న్యాయస్థానం వాట్సప్ ద్వారా సమన్లు పంపాలని ఆదేశాలు జారీచేసింది. ఓ మెసేజింగ్ యాప్ ద్వారా కోర్టు సమన్లు పంపడం ఇదే మొట్ట మొదటిసారి. హర్యానా రాష్ట్రం హిసార్‌లోని ఔరంగ్ షాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం విషయంలో విచారణ జరుపుతున్న న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా ఆధ్వర్యంలోని ఫైనాన్షియల్ కమిషనర్(ఎఫ్‌సీ) కోర్టులో.. ఆస్తి విషయమై సత్బీర్ సింగ్ అనే వ్యక్తి తన ఇద్దరు సోదరులు రామ్‌దయాళ్, కృష్ణకుమార్‌పై కేసు వేశాడు.
ఈ కేసు విషయంలో వారిద్దరి నుంచి సమాధానం కోరుతూ ఒక సోదరుడయిన రామ్‌దయాళ్‌కు నోటీసులు అందించింది. అయితే, మరో సోదరుడు కృష్ణ ఖాట్మండులో ఉండడంతో ఆయన అందుబాటులో లేడు. ఆయనకు ఫోన్ చేస్తే తన అడ్రస్సు చెప్పడానికి కూడా కృష్ణ ఒప్పుకోలేదు. దీంతో అశోక్ ఖేమ్కా స్పందిస్తూ... ప్రస్తుత పరిస్థితుల్లో ఓ వ్యక్తి ఈ-మెయిల్ అడ్రస్‌నుగానీ, మొబైల్ నంబరును గానీ చిరునామాగానే పరిగణిస్తామని గుర్తు చేశారు. కృష్ణకు వాట్సప్ ద్వారా సమన్లు పంపాలని ఆదేశాలు ఇచ్చారు. అనంతరం ఆ డెలివరీ నివేదికను ప్రింట్‌అవుట్ తీసి తమకు ఇవ్వాలని సూచించారు.