: ప్రియుడి సాయంతో భర్తపై కేసులు పెట్టిన యువతి.. భర్త ఆత్మహత్య
వారిద్దరి మతాలూ వేరు వేరు.. అయినప్పటికీ వారి మనసులు కలిశాయి. గాఢంగా ప్రేమలో మునిగిపోయారు.. పెద్దలు వద్దని చెప్పినా తమని ఎవరూ విడదీయలేరంటూ పెళ్లి చేసుకున్నారు. అయితే, వారిద్దరి మధ్య చిచ్చు రేపింది వివాహేతర సంబంధం. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య ఇతర వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న ఆ భర్త ఆమెతో విడిపోయాడు. గత ఏడాది కాలంగా వారిద్దరూ వేర్వేరుగానే ఉంటున్నారు. అయితే, ఆ భర్త ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య ప్రియుడితో కలిసి కేసులు పెట్టడంతో తన ఆత్మహత్యకు కారణం భార్య, అత్తమామలేనని సూసైడ్ నోట్ రాసిపెట్టి ప్రాణాలు తీసుకున్నాడు ఆ భర్త. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిజానిజాలను రాబడుతున్నారు.
పూర్తి వివరాలు చూస్తే.. చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రాంతం పరిధిలోని యనమలవారిపల్లెలో నివాసముంటున్న డేనియల్ కుమారుడు కె.స్వరాజ్‌కుమార్ (26) మదనపల్లెలో డిగ్రీ కోర్సు చదువుతున్న సమయంలో అదే పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన షేక్ హుస్సేన్, బషీరున్నీషా దంపతుల కుమార్తె యాస్మిన్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం రాను రాను ప్రేమగా మారి, నాలుగేళ్ల తర్వాత తమ పెద్దలను ఎదిరించి మతాంతర వివాహం చేసుకుని, మూడేళ్ల పాటు హాయిగా జీవించారు.
ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ స్వరాజ్ కుమార్ వచ్చిన జీతంతో తన భార్యతో ఆనందంగా గడుపుతున్నాడు. అయితే, భర్త అంగీకారంతో యాస్మిన్ మదనపల్లెలోని ఓ నర్సింగ్ హోమ్‌లో పనిచేస్తూ అక్కడ పనిచేసే శ్రీనివాసులుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమె పుట్టింటికి వచ్చేసింది. తన తల్లిదండ్రులు, ప్రియుడి సాయంతో భర్త స్వరాజ్‌కుమార్‌పై పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టింది. అయితే, వారి వేధింపులు తాళలేక భర్త స్వరాజ్‌కుమార్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.