: దంచికొట్టిన జాదవ్.. సొంతగడ్డపై విజయంతో బోణీ కొట్టిన బెంగళూరు
సొంతగడ్డపై ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బోణీ కొట్టింది. 15 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను మట్టికరిపించింది. తొలుత టాస్ గెలిచిన బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. మెరుపులు మెరిపిస్తాడని ఆశలు పెట్టుకున్న క్రిస్‌గేల్ 6 పరుగులకే పెవిలియన్ చేరి ఉసూరుమనిపించాడు. కెప్టెన్ క్రిస్‌గేల్ కూడా 24 పరుగులకే వెనుదిరగడంతో జట్టు కష్టాల్లో పడింది. మన్‌దీప్ కూడా క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బంది పడి వికెట్ సమర్పించుకున్నాడు. 55 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన దశలో బ్యాటింగ్‌కు దిగిన కేదార్ జాదవ్ (37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయి ప్రత్యర్థి ముందు 158 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.
అనంతరం బరిలోకి దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసి పరాజయం పాలైంది. డేర్‌డెవిల్స్‌లో రిషబ్ పంత్ (36 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు) ఒంటరి పోరాటం వృథా అయింది. బెంగళూరు బౌలర్ల ధాటికి తలవంచిన డెవిల్స్ బ్యాట్స్‌మెన్ క్రీజులోకి వచ్చినవారు వచ్చినట్టే పెవిలియన్ చేరారు. ఓపెనర్లు ఆదిత్య తారే (17 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు), బిల్లింగ్స్ (19 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌తో 25), కరుణ్ నాయర్ (4), శామ్సన్ (13)లు విఫలమవడంతో డేర్‌డెవిల్స్ ఓటమి మూటగట్టుకుంది. కాగా, చిన్నస్వామి స్టేడియంలో 200 కంటే తక్కువ పరుగులు చేసి విజయం సాధించడం రెండేళ్లలో ఇదే తొలిసారి.