: భార్యను హత్య చేయబోయి చివరికి తానే ఖతమైపోయాడు!
కొన్నిసార్లు చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి...అలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే....మంగళగిరి మండలం కురగల్లు గ్రామానికి చెందిన నల్లిబోయిన గంగమ్మకు, వెంకట్రావుతో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు సంతానం కలగలేదు. దీంతో వీరి మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో బుధవారం దీనిపై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది.
దీంతో కోపోద్రిక్తుడైన వెంకట్రావు భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆమె కేకలు వేయడంతో బంధువులు, ఇంటి చుట్టుపక్కల వారు మంటలు ఆర్పి ఆమెను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆమె నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. అనంతరం ఘటనకు కారణమైన వెంకట్రావుపై కేసు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న వెంకట్రావు భయంతో గుండెపోటుకు గురయ్యాడు. అతనిని చినకాకానిలోని ఆసుపత్రికి తరలించేలోపు ప్రాణాలు కోల్పోయాడు. భార్యను హత్య చేయబోయిన వెంకట్రావు కథ చివరికి అలా ముగిసిపోయింది.