: వేరే పనులుండి రాలేదంతే... చిరంజీవి ఎక్కడికీ పోరు: ఏపీ కాంగ్రెస్
ఈ ఉదయం ఏపీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం జరిగిన వేళ, ఆ పార్టీ ఎంపీ, హీరో చిరంజీవి గైర్హాజరు కావడంపై మరో మాజీ ఎంపీ పళ్లంరాజు స్పందించారు. కొన్ని అనివార్య కారణాలతోనే ఆయన రాలేదని, వేరే పనుల్లో బిజీగా ఉన్నానని ఆయన సమాచారం ఇచ్చారని పళ్లంరాజు తెలిపారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీని వీడి ఎక్కడికీ పోరని, ఆయన ఇతర పార్టీల్లో చేరుతారన్న వార్తలు ఊహాగానాలేనని, సమావేశం అనంతరం కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలంతో కలసి మీడియాతో మాట్లాడిన పళ్లంరాజు తెలిపారు. ఈ సమావేశంలో పలు అంతర్గత విషయాలు, పార్టీ భవిష్యత్ కార్యక్రమాల గురించి చర్చించామని, రాష్ట్రంలోని పరిస్థితులను విశ్లేషించామని ఆయన అన్నారు. ప్రజా బ్యాలెట్, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం నిరసనలు, నోట్ల రద్దు తరువాత ప్రజల ఇబ్బందులు, రాష్ట్రంలో సాగుతున్న పాలనలో లోటుపాట్లు తదితరాలపై కూలంకుషంగా చర్చించామని వెల్లడించారు.