: జమ్మలమడుగులో గొడవ జరుగుతుందని ముందే తెలుసు: సీఎం రమేష్
జమ్మలమడుగులో నిన్న జరిగిన పరిణామాలను తాను ముందే ఊహించానని పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన, కార్యకర్తల్లో ఆవేశం ఉండటం చాలా సహజమని, జరిగిన ఘటన చాలా చిన్నదని అన్నారు. తనకు పదవి కావాలని, పనులు చేసి పెట్టాలని రామసుబ్బారెడ్డి ఎన్నడూ అడగలేదని చెప్పారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి న్యాయం చేస్తానని సీఎం చంద్రబాబు స్వయంగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
ఆయనకు పదవి దక్కలేదన్న కారణంతోనే ఆయన అనుచరులు, తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని, వారి బాధను తాను అర్థం చేసుకున్నానని తెలిపారు. జిల్లాలో పార్టీ నేతల మధ్య ఎలాంటి విభేదాలూ లేవని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేసి విజయం సాధించామని, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ ఇదే విధమైన ఫలితాలను సాధిస్తుందన్న నమ్మకముందని అన్నారు. ప్రత్యేక హోదాపై వైకాపా అధినేతకు చిత్తశుద్ధి ఉంటే ఎంపీలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. కడప ప్రాంతంలో జగన్ కుటుంబ ఆధిపత్యాన్ని పూర్తిగా రూపుమాపుతామని అన్నారు.