: కేజ్రీవాల్ ను ఏకేసిన షుంగ్లూ కమిటీ.. మున్సిపల్ ఎన్నికలకు ముందు 'ఆప్'కు ఎదురుదెబ్బ!
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ముందు ఆప్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నగరంలోని ఆప్ కార్యాలయాన్ని వెంటనే ఖాళీ చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కేజ్రీవాల్ ను ఆదేశించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ ను సంప్రదించకుండా సొంత పార్టీ కోసం భూమిని కేటాయించుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆప్ ప్రభుత్వ అధికార దుర్వినియోగంపై గతంలో లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేసిన నజీబ్ జంగ్ ముగ్గురు సభ్యులతో కూడిన వీకే షుంగ్లూ కమిటీని నియమించారు.
లెఫ్టినెంట్ గవర్నర్ ను సంప్రదించకుండానే పార్టీ కోసం భూమిని కేటాయించుకుని, భవనాన్ని నిర్మించుకోవడాన్ని షుంగ్లూ కమిటీ తప్పుబట్టింది. అంతేకాదు, ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతి మలివాల్ కు నివాస భవనం ఎలా కేటాయిస్తారని కూడా కమిటీ ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే, పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాలంటూ కేజ్రీవాల్ కు ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఆదేశాలు జారీ చేశారు.