: ధోనీని తిట్టాడు... చేతులు కాలాక ఆకులు పట్టుకున్నాడు!


ఈ ఐపీఎల్ సీజన్ లో మహేంద్ర సింగ్ ధోనీని పుణె జట్టు కెప్టెన్సీ పదవి నుంచి తొలగించి, కేవలం ఆటగాడిగా పరిమితం చేసిన టీమ్ యజమాని సంజీవ్ గోయంకా సోదరుడు హర్ష్ గోయంకా, ధోనీని తూలనాడుతూ, స్టీవ్ స్మిత్ ను తెగపొగిడి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ముంబై ఇండియన్స్ పై గెలుపు తరువాత, కెప్టెన్ స్టీవ్ స్మిత్ ను ఆకాశానికి ఎత్తేస్తూ, అతను అడవికి రాజని, తాను రాజునేనని స్మిత్ నిరూపించాడని, ధోనీని కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితం చేశాడని ట్వీట్ చేశాడు. స్మిత్ ను కెప్టెన్ గా నియమించడం సరైన నిర్ణయమేనని అన్నాడు.

ఈ ట్వీట్ వైరల్ కాగా, ధోనీ అభిమానులు గోయంకాపై నిప్పులు చెరిగారు. ఆసీస్ ఆటగాళ్లతో ధోనీని పోల్చి అవమానించినందుకు సిగ్గుపడాలని, కేవలం ధోనీ వల్లే పుణె జట్టును అభిమానిస్తున్నామని, తాము స్టేడియానికి వచ్చిందే ధోనీ కోసమని తేల్చి చెప్పారు. స్మిత్ బాగా ఆడి ఉండవచ్చేమో కానీ, ధోనీ అంత దిగ్గజాన్ని ఎలా గౌరవించాలో నేర్చుకోవాలని హితవు పలికారు. తాము స్మిత్ కోసమో, స్టోక్స్ కోసమో, లేక దిండా కోసమో మ్యాచ్ చూడలేదని బుద్ధి చెప్పారు. దీంతో తన తొలి ట్వీట్ ను తొలగించి, ధోనీ క్రికెట్ స్టార్ అన్ని విషయాన్ని అంగీకరిస్తున్నానని చెప్పినా, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హర్ష్ గోయంకా చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లయింది.

  • Loading...

More Telugu News