: ఆ వైమానిక స్థావరాన్ని కేవలం 23 క్షిపణులు మాత్రమే తాకాయి: అమెరికా దాడిపై రష్యా రక్షణ శాఖ
సిరియా ప్రభుత్వం జరిపిన రసాయన దాడులకు ప్రతిగా అమెరికా ఈ రోజు షయరత్ ఎయిర్‌బేస్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 59 మిస్సైళ్లను ప్రయోగించినట్లు అమెరికాకు చెందిన రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ పేర్కొంది. అయితే, ఈ అంశంపై స్పందించిన రష్యా రక్షణ శాఖ.. ఈ దాడులు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయని తెలిపింది. ఆ వైమానిక స్థావరాన్ని కేవలం 23 క్షిపణులు మాత్రమే తాకినట్లు తేల్చి చెప్పింది. ఇక మిగతా 36 మిస్సైళ్లు ఏమయ్యాయో స్పష్టత లేదని తెలిపింది.
ఈ దాడిని సిరియా సైన్యం ముందుగా కనిపెట్టి, సదరు ఎయిర్‌బేస్ నుంచి ముందుగానే సైన్యాన్ని, సామగ్రిని తరలించినట్లు పలువురు చెబుతున్నారు. ఈ దాడుల్లో కేవలం ఆరుగురు మాత్రమే ప్రాణాలు కోల్పోయినట్లు సిరియన్ ఆర్మీ తెలిపింది. అమెరికా నిర్వహించిన ఈ దాడులపై బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలు మద్దతును ప్రకటించగా.. రష్యా, ఇరాన్ దేశాలు మాత్రం ఖండిస్తున్నాయి.